‘లైఫ్ అనుభవించు రాజా’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

0
4

లైఫ్ అనుభవించు రాజా అంటూ కొత్త నటీనటులతో ముందుకు వచ్చారు. టైటిల్‌తోనే ఆకట్టునే ప్రయత్నం చిత్రయూనిట్ చేసినట్టు కనిపిస్తుంది. యూత్‌ను టార్గెట్ చేసిన తీసిన ఈ చిత్రం ఏ మేరకు ఫలించింది? ప్రేమికుల రోజున రిలీజ్ చేసిన ఈ లైఫ్ అనుభవించు రాజా ఆ వర్గం ప్రేక్షకులను మెప్పించిందా? లేదా ఓ సారి చూద్దాం.

కథరాజా (రవితేజ) చదువులో అంతంతమాత్రమే అయినా వ్యాపార ఆలోచనలు మెండుగానే ఉంటాయి. అయితే చేసిన ఏ ప్రయత్నమూ వర్కౌట్ కాదు. ఎన్ని వ్యాపారాలు చేసినా ఒక్కటీ కలిసి రాదు. చివరకు తాను ప్రేమించిన నిత్యా హారతి (శ్రావణి నిక్కీ) కూడా దూరమవుతుంది. ఇక తనకు చావే శరణ్యమని చూసినా.. అక్కడా ఫెయిలే అవుతాడు. ఇలా కుదరదని తపస్సు చేసుకుందామని హిమాలయాలకు వెళ్తాడు.

కథలో ట్విస్ట్‌లుహిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిన రాజాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడ శ్రియా (శ్రుతీ శెట్టి) పరిచయంతో కథ ఎలా మలుపుతిరుగుతుంది? లైఫ్‌లో సక్సెస్ అయితే తన ప్రేమ కూడా దక్కుతుందని శ్రియ వెళ్లిపోవడంతో ఏం జరుగుతుంది? వాటర్, బీర్ బిజినెస్‌లో రాజా అంచలెంచలుగా ఎలా ఎదుగుతాడు? చివరకు నిత్యా హారతి, శ్రియలు ఏమవుతారు? లాంటి వాటికి సమాధానమే లైఫ్ అనుభవించు రాజా.

ఫస్టాఫ్ అనాలిసిస్..జీవితంలో ఏమీ సాధించలేని రాజా (రవితేజ).. స్వామి మాల వేసుకోవడం.. తన గతాన్ని తలుచుకుంటూ హిమాలయాలకు ప్రయాణం అవ్వడంతో కథ మొదలవుతుంది. ఏ వ్యాపారం మొదలు పెట్టినా అదృష్టం కలిసి రాకపోవడం, ఏదో రకమైన అడ్డుతగలడం లాంటి సీన్లతో కథ ముందుకు వెళ్తుంది. ఇలా తన జీవితం కొనసాగుతుండగా.. నిత్యా హారతి పరిచయం, ఆమెతో ప్రేమాయణం సీన్లతో కాస్త బోర్ కొట్టించినట్టు అనిపిస్తుంది. ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించకపోవడం, ప్రథమార్థం మొత్తం అవే సీన్లు తిప్పి తిప్పి చూపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. నిత్యా హారతి దూరమవ్వడం, హిమాలయాల్లో పరిచయమైన శ్రియా కూడా దూరమవ్వడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ఓ గమ్యం లేని కథ కథనాలతో ప్రథమార్థం సాగిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్..ఏదో సాధించాలని పట్టుదలతో ఉన్నట్టు రాజా కనిపించడంతో ద్వితీయార్థంలో కనీసం కథ ఏదైనా ఉంటుందని ఆశించిన ప్రేక్షకుడికి మొదటి సీన్‌లో నిరాశ కలిగే అవకాశం ఉంది. వాటర్ బిజినిస్ పెట్టడం, పోలీసులు అరెస్ట్ చేయడం, అది వైరల్ అయ్యేలా రాజా చేయడం, ఎవరో వచ్చి విడిపించడం మరీ సిల్లీగా అనిపిస్తుంది. వాటర్ బిజినెస్‌లో ఎదగడం, రిచ్ బీర్ అంటూ రూ.300కు అమ్మడం ఇవన్నీ ఊహకందనంత దూరంలో తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. ఈ సీన్స్ అన్నీ కూడా చిత్రంగా అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఇలా లైఫ్‌లో తనకంటూ ఓ గుర్తింపు, స్థాయిని సంపాదించుకుంటాడు రాజా. చివరకు తాను ప్రేమించిన నిత్యా, శ్రియాలు ఇద్దరూ రావడం, వారిద్దరినీ కాదనుకోవడంతో ద్వితీయార్థం కూడా ముగుస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్..ఈ చిత్రంలో ఎక్కువగా కనిపించే పాత్ర, వినిపించే పాత్ర రాజాదే. రాజా పాత్రలో రవితేజ పర్వాలేదనిపించాడు. సాధారణ కుర్రాడిగా ఉన్నప్పుడు ఓకే అనిపించినా రాజా.. పెద్ద వ్యాపారవేత్త మాత్రం సూట్ కాలేదనిపిస్తుంది. శ్రావణి నిక్కి, శ్రుతీ శెట్టి ఇద్దరూ ఇద్దరే అనిపించారు. ఈ ఇద్దరిలో శ్రుతీ శెట్టి కాస్త నటించిందనే ఫీలింగ్ కలుగుతుంది. గిరి, కిండిల్ సక్సేనా పాత్రల్లో నటించిన కమెడియన్స్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వారంతా తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడి పనితీరు..లైఫ్ అనుభవించు రాజాలో కథ, కథనాలు రెండూ లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. కథనాన్ని గాలికొదిలేసినట్టు అనిపిస్తుంది. ఓ సీన్‌కు మరో సీన్‌కు సంబంధం లేకుండా వెళ్లినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోకు ఇచ్చే హైప్, ఎదిగే తీరు ఏదీ నమ్మశక్యంగా అనిపించకపోవడం దర్శకత్వ లోపమే. ఇంతా చేసినా దర్శకుడు చివరకు అందించే సందేశమేంటో ఎవరికీ అర్థం కాదు. తన వద్దకు వచ్చిన ఇద్దర్నీ కాదనుకోవడంతో సినిమాకు ఓ సరైన ముగింపు కూడా ఇవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

బలాలు, బలహీనతలు..ప్లస్ పాయింట్స్

సినిమాటోగ్రఫీ
సంగీతం

మైనస్ పాయింట్స్
కథ కథనం
దర్శకత్వం
నటీనటులు

ఫైనల్‌గా..లైఫ్ అనుభవించు రాజా అనే టైటిల్‌తో యూత్‌ను ఆకట్టుకున్నా.. థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోవచ్చు. బీ, సీ సెంటర్స్‌లో ఈ చిత్రం గనుక నిలకడగా నిలబడితే కమర్షియల్‌గానైనా గట్టెకెక్కవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here