పటాస్‌లా పేలుతున్న పాటలు

0
10
Dhanush Pattas Movie Songs Viral In Social Media - Sakshi

‘పటాస్‌’ పేరుతో ఇప్పడు ఒక భారీ చిత్రం రూపొందుతోంది. అయితే పేరుకు తగ్గట్టుగానే ప్రచారం మారుమోగుతోంది. ఎందుకంటే పటాస్‌లో హీరో ధనుష్‌ కావడం ఒక కారణం అయితే, ఇందులో ఆయన ద్విపాత్రాభియనం చేయడం మరో హైలైట్‌. నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌ ఈ చిత్రానికి డబుల్‌ ప్లస్‌ కానుంది. దురైసెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెంథిల్‌ ఇంతకు ముందు ధనుష్‌ హీరోగా కొడి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

చిత్ర షూటింగ్‌ చూర్తిచేసుకుని ప్రస్తుతం మ్యూజికల్‌ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనికి వివేక్‌–మెర్విన్ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రంలోని జిల్‌ బ్రో సింగిల్‌ సాంగ్‌ను ఆ తరువాత మొరట్టు తమిళండా సాంగ్‌ను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఇప్పుడు జికిడి కిల్లాడి అనే పల్లవితో సాగే మూడో పాటను కూడా విడుదల చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే యువ సంగీతదర్శకుడు అనిరుద్‌ పాడడం. ఈ పాట ఇప్పుడు మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. దీంతో చిత్ర సంగీత దర్శకులు యమఖుషీలో ఉన్నారు.

ఆ ఆనందాన్ని ఆ ద్వయంలో ఒకరైన వివేక్‌ వ్యక్తం చేస్తూ తమ సంగీతంలో అనిరుద్‌ పాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన తమకు స్నేహితుడికంటే ఎక్కువ అని, సహోదరుడు మాదిరి అని పేర్కొన్నారు. అనిరుద్‌ను తమ సంగీతంలో పాడించాలన్న చిరకాల కోరిక ఈ చిత్రం ద్వారా తీరడం ఆనందంగా ఉందన్నారు. ఆయన పాడిన జకిడి కిల్లాడి పాట తమ మనసుకు చాలా దగ్గరైన పాట అని అన్నారు. ధనుష్, అనిరుద్‌ల కాంబినేషన్‌ ఎప్పుడూ హిట్టేనని అన్నారు. దాన్ని ఈ పాట సక్సెస్‌ మరోసారి నిరూపించిందని అన్నారు.

పటాస్‌ చిత్రం కోసం తాము 8, 9 నెలలుగా పని చేస్తున్నామని, ప్రతి నిమిషం ఆ సంతోషాన్ని అనుభవిస్తూ పనిచేస్తున్నట్లు తెలిపారు. పటాస్‌ చిత్రం పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేయడం సినీ జీవితంలోనే తమకు పెద్ద అవకాశంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నవీన్‌చంద్ర విలన్‌గా నటిస్తున్నారు. చిత్ర ట్రైలర్‌ను, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని 2020 జనవరి 16వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here