పండుగ సంబరం ముందే వచ్చింది!

0
2

పండుగ ఆనందాన్ని ముందుగానే తీసుకొచ్చిన విజయమిదని అన్నారు అల్లు అరవింద్‌. రాధాకృష్ణతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించారు. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఆదివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు అందించిన భిక్ష ఈ విజయం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో తొలిరోజు సాయంత్రానికి పంపిణీదారులు లాభాల బాటపట్టారు. అమెరికాలో తక్కువ థియేటర్లలో విడుదలైనా తొలి రోజున అద్భుతమైన వసూళ్లను సాధించింది. బన్నీ కెరీర్‌లో ఆల్‌టైమ్‌ హిట్‌ అంటున్నారు. 2019 ఏడాదికి ‘ప్రతిరోజూ పండగే’ సక్సెస్‌తో వీడ్కోలు పలికాం. 2020కి ఈ సినిమా విజయంతో స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. కోడిపందాల మాదిరిగానే మా సినిమాను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. బన్నీ కాల్‌షీట్లు నా దగ్గర ఉన్నా సరైన కథ, దర్శకుడిని సెట్‌ చేయలేకపోయాను. అందువల్లే అతడి కెరీర్‌కు గ్యాప్‌ వచ్చింది. గ్యాప్‌కు కారణమైనందుకు బన్నీ నా మీద కావాలి(నవ్వుతూ). రాధాకృష్ణతో కలిసి ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఆయనతో పాటు ఇతర నిర్మాతలతో కలిసి మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. ‘రేసుగుర్రం’ తర్వాత నాలో చక్కటి అనుభూతిని పంచిన సినిమా ఇది. బన్నీలో ఇన్ని కళలుంటాయా? ఎప్పుడూ చూపించడేంటి అనిపించింది. అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు. ఒక సంక్రాంతికి కుడి ఎడమలుగా రెండు వీకెండ్స్‌ రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సంక్రాంతిని, వీకెండ్స్‌ను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఆదివారం సినిమాను విడుదలచేశాం. నా పుట్టినరోజు బహుమతికి మించిన పెద్ద విజయమిది. లైఫ్‌లో అరుదుగా లభించే గిఫ్ట్‌ ఈ సినిమా’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here